Saturday, October 29, 2011


నాలుగు రాళ్ళు
వెనక వేసుకోవాలని
భక్తుని కోరిక
విని విని
ఏకంగా దేవుడే
రాయిగా మారిపోయాడు!

Tuesday, October 25, 2011


శిలల కలల్ని శిల్ప కళలో మెరిపిస్తూ కొందరు, జనం భాదల్ని విశ్వ దర్శనం చేస్తూ మరి కొందరు నడిచే దిశలు అక్షరాలకు ఆత్మ బంధువులు... క్షణాలు గాయపడినా, నిముషాలు నీరసపడినా ప్రతిస్పందన రేఖ పై భావం నిలబడదు!

ఎంతటి
ప్రవాహమయినా
శీతగాలి ఎక్కువైతే
శిల గా మారుతుంది
ఎంత
గట్టి గుండె అయినా
ప్రేమ గాలి తాకితే
ప్రవాహమవుతుంది!

Monday, October 24, 2011

ఉనికి-కీర్తి..!


నాకే తెలియకుండా
రెండు కన్నీటి బొట్లు
భూమిపై పడ్డాయి
ఒకటి ఉనికి
మరొకటి కీర్తి..

Saturday, October 22, 2011

జీవితం!


ప్రమిద
ఆధారం!
నూనె ధర్మం!
వత్తి వారధి
దీపం
జీవితం!

Thursday, October 20, 2011

ఏ పాపం చేసానమ్మా ?


ఏ పాపం చేసానమ్మా ?
నన్నిలా విసిరేసావు
మోసమే చేసావో, మోసపోయావో కాని
మొత్తానికి నన్ను పావును చేసావు కదమ్మా?
ప్రేమ ప్రేతాత్మ నిన్నే కాదు
రేపు నన్ను కూడా తాకుతుందని
భయపడ్డావా అమ్మా?
దారికాచి ఎవరైనా మానభంగం
చేస్తారని వణికి పోయావామ్మా?
అత్యాశ చట్రంలో ఇరుక్కొని
మోసపు సమాజం వెంట వెళ్ళిపోతానని
ఉహించావామ్మా?
కీర్తి కండూతి కప్పుకోవడానికి
ఆత్మాభిమానాన్ని వదిలేస్తానని
ఆలోచించావామ్మా?
ఎందుకమ్మా నన్ను ఇలా విసిరేసావు?
నాకు లోకం తెలియకున్నా
ఒక్క మాట చెబుతున్నా
నవమాసాలు మోసి కనే తల్లిలోనే
ఇంత విషపు ఆలోచనలుంటే
ఎవరికో నేనెందుకు భయపడాలమ్మా?
నీకంటే నాకు శత్రువులు
ఎవరు చెప్పమ్మా?

Wednesday, October 19, 2011

ఏమి రాత ఇది ?


ఏమి రాత ఇది ?
ఎందుకంత ఇది?
ఎంతకాలమిది ?
కొసమెరుపు కోరిక ఇది!
కొనగోటి జీవితమిది!
అందితే నీది
అందకుంటే నాది
ఏమి లేకుంటే మిగులుతుంది
మనకు పెన్నిధి!

ఎక్కడిదీ అంతరంగం?


ఎక్కడిదీ అంతరంగం?
ఏ నిముషంలో నాలో ప్రవేశించింది?
నిదురలో, మెలకువలో
కళ్ళలో ఒదిగిపోయిన మెలకువ!
ఇంటి వాకిట్లో అరుణోదయమయింది
మనస్సును తపస్సుగా మార్చింది
నానుండే ప్రతి దిశకు పాకింది
చీకటీ వెలుగు తేడా లేకుండా
నన్ను నన్నుగా మార్చేసింది..

Tuesday, October 18, 2011

మధురం


భూమి గుండె గాయ పడితే
మొక్క బయటకు వస్తుంది
మబ్బు గుండె గాయపడితే
వాన చినుకు నేల రాలుతుంది
మనిషి గుండె గాయపడితే
గేయమై అలరిస్తుంది.
బాధ వెనుక మధురం ఆంటే ఇవేనేమో!

రెండు


ఒక సాయంత్రం నుండి
మరో సాయంత్రానికి చేరుకోవాలంటే
రెండు తలుపులు తెరవాలి!
ఒకటి ఉదయం
మరొకటి మధ్యాహ్నం
జీవితాన్ని గెలవాలంటే
రెండు తెరలు తొలగించాలి!
ఒకటి స్వార్థం
మరొకటి అసూయ!

Saturday, October 15, 2011

దూరం



నాలోని ఆవేదనను తరిమేసా
ఎదురుగా పచ్చని చెట్ట్లై నిలిచాయి
నాలోని విషాదాన్ని వెలివేసా
ఎదురుగా పచ్చికై కనిపించింది
నాలోని అత్యాశను దూరం చేశా
ఎదురుగా ఆకాశమై నవ్వుతోంది
నాలోని నన్నే విసిరేశా
నీ అనురాగంగా రూపు దిద్దుకుంది

పసితనం!


ఏ భాషకు అందని భావం
ఏ కవీ రచించలేని కావ్యం
ఏ గాయకునికి అంతుచిక్కని గీతం
ఏ కులానికీ, ఏ మతానికీ చెందని మౌనం
స్వచ్చమయిన అమాయకత్వం!
ముద్దులు మూట కట్టే పసితనం!

Friday, October 14, 2011

ఆరాధన


మనసున నీరూపం నిలిచింది
మమతల పెనుతుఫాను లేపింది
మమతలెరుగని మనసు నాది
మనసే లేని మనిషివి నీవు
పిచ్చిగా తలుస్తాను నిన్నే ప్రియ బంధవుడని
ప్రేమ నిండిన నీ చూపే పదివేలు అనుకుంటాను.
అంకితం చేసాను ఎప్పుడో అంతరంగాన్ని నీకే
అందుకోలేనని తెలుసు
అది అవివేకమని తెలుసు
ఎన్ని తెలిసినా ఏమి ప్రయోజనం!
నీ జ్ఞాపకాన్ని వీడలేను
నిన్ను మరచి మనలేను!
నువ్వు ఎవరినైనా ప్రేమించాలి
నాలాగే కన్నీళ్లు నింపాలి
అర్థమవుతుంది అప్పుడే నీకు
ఆరాధనకు అర్థమేమిటో ?

ఇదే దేశ చిత్ర పటం!
ప్రతి చేతుల్లో వాలిపోతున్న
ప్రస్తుత శాంతి సందేశం!
ఆ తల్లి కన్నది
విశాల హృదయాన్నే!
మిగిలింది మాత్రం
చిల్లులు పడ్డ ప్రదేశం!

నాది నీది



నీకోసం నేను
నాకోసం నీవు
ఇద్దరినీ వేరు చేసేది
నాది నీది

గుండె
గాయమయితే
మందుంది
గాయమే
గుండె గా మారితే
ఏ మందు
సరిపోతుంది..??

Thursday, October 13, 2011


ఆకాశంలో జాబిల్లి
మంచు దుప్పటి కప్పుకుంది
నేలపై పేదరికం
ఏకంగా
ఆకాశాన్నే కప్పుకుంది

Wednesday, October 12, 2011

ప్రేమ తీరం


అనురాగపు ఆకాశంలో
ఒక చినుకు ఎండని తడిపింది
కలల ప్రవాహపు వేడిలో
ఒక పిలుపు గుండెను తడిమింది
రెండు మనసుల కలయికల స్వరంలో
ఒక మబ్బు పాదం మోపింది
ఏడు వర్ణాల ఇంద్రదనుస్సు నీడలో
చెట్టు చేతివేళ్ళ చివర
ఒక మొగ్గ పువై విరబూసింది
సాయకాలపు సూర్యబింబం ఓంపులో
వాన ఒళ్ళు విరుచుకుంది
కాలం తెలిపిన ప్రేమ తీరాల మీద
జ్ఞాపకాల స్పృహను తట్టి లేపి
అనుభూతుల స్వరం సమస్తం
చిద్విలాసపు చిందులు తొక్కుతోంది
దేహపు మట్టిలో కూరుకుపోయిన గొంతు
తనకు తానే ఓటమిని అంగీకరిస్తోంది
నేలపై నడిచే నావ
ఆత్మను కోల్పోయి గాలికి ఆహుతి అవుతోంది
ప్రేమంటే సరికొత్త అర్థం కనబడుతోంది

నేనే నువ్వు..నువ్వేనేను


నేను పువ్వునై నిల్చున్ననా..
తుమ్మెదవై నన్ను అలరిస్తావు..
నేను శిశిరమై చూస్తుంటావా..
సుడిగాలిలా వచ్చి నన్ను చుట్టుకుపోతావు..
వసంత రాగాన్నై పాడుతుంటానా..
నా కంటిముందు కోయిలై రాగాలు ఆలపిస్తావు...
నేను ప్రేమను అందిస్తానా..
ఆరాధనగా మారి నన్ను అభిషేకిస్తావు
పరవశమై పలకరిస్తానా..
నా ఆలోచనలన్నీ ఖాళీ చేస్తానా..
అలనై ఎగసి పడతానా..
అనుబంధాన్ని అణువణువునా నింపేస్తావు!
నీ పాద ముద్రల్ని గీస్తుంటానా..
అనిర్వచనమయిన ఆనందాన్ని అందిస్తావు..
మొదటి మెట్టుపై నిలుచుంటానా..
ఆఖరి మజిలీ నువ్వే అంటావు..
నే చేతిని అందిస్తానా..
చిగురులా నూతనోత్సాహాన్ని నింపుతావు.
నువ్వే కావాలని నేనంటానా..
నీ గుండెలో నా ప్రతి రూపాన్ని నింపుతావు
ప్రతిక్షణం నీదేనని నేననుకుంటానా..
ప్రతి శ్వాసలో నేనేనని నువ్వంటావు..
నిజం..
నువ్వే నేను..
నేనే నువ్వు..!

Tuesday, October 11, 2011

సాన్నిహిత్యం..


కొన్ని వేళ మైళ్ళ దూరంలో ఉన్నా
చందమామకు సముద్రంతోనే సాన్నిహిత్యం..
స్నేహానికి ఇంతకంటే
నిర్వచనం లేదనేది ఔచిత్యం !!