Saturday, March 17, 2012

స్మ్రుతి బింబాలు 
నిత్యం జ్ఞప్తికి వస్తున్నా 
ఈనాటి వరకు నా ముఖం నిజ వర్ణం ఎరుగదు 
నా మస్తిష్కం నిశ్సబ్దం ఎరుగదు 
ఎంత రాసినా 
కాగితంపై ఒకవైపు 
రోజువారీ అవసరాల పట్టీ
ఏరోజుకారోజు 
జీవితం మూడు గీతాల్లోని బొమ్మ!

ఎక్కడో వేదకకండి 
నేను మీ ఎదుటే ఉన్నాను
అనుభవ రూపంలో 
ఇది సిద్ధాంతం కాదు 
నినాదం అంతకంటే కాదు 
అన్నింటికీ ఎదిరించి నిలిచిన నిజం 
భిన్నత్వంలో ఏకత్వం!
రంగులేన్ని ఉన్నా 
ఆకాశానికి అహం లేదు 
పూలకు నిర్లక్ష్యం లేదు 
ప్రకృతికి పరధ్యాస లేదు 
రెండే రంగులున్న  
మనిషికి వికారాలు ఎన్నో 
అందుకే 
ప్రారబ్దాలు అన్నీ!

ఆశ నాటితే
నిరాశ మొలుస్తుంది
ఆవేశం నాటితే 
అనాలోచితం నిద్ర లేస్తుంది   
ఆశయాలు నాటితే 
జీవితం నిలుస్తుంది 

Friday, March 16, 2012

 పేదవాడి శ్రమకు 
సృష్టి కి అంటిన  స్వేదం 
వంద పచ్చ రూకలు పోసినా 
కనిపించని అందం 
మాటకు మంత్రం నీరు 
కంటికి సూత్రం పచ్చదనం 
ఎప్పటికి ఇదే శాశ్వతం !

Monday, March 12, 2012

దారికడ్డంగా తిరిగే నిన్ను చూసే 
సమయం లేదు
నీ గడుసుతనం కంటే నా పెంకితనమే నయమని 
చెట్టు చాటు నుండి కాలం నవ్వుతోంది 
ఇంతకీ ఎవరు నీవు 
వెలుగులోని అంచువా ?
చీకటిలోని క్రీనీడవా?
కొమ్మల్లో పాకే చంద్రుడిని చూస్తే 
ప్రేమలో చిక్కుకున్న హృదయం 
గుర్తుకు వస్తుంది 
అందనంత వరకు ప్రేమ పూలలో జ్వాల
అందిన క్షణంలో ప్రేమ చేతిలో అమృత మాల 
కాలమెంతగా 
పరుగులు తీస్తున్నా 
సృష్టి ఎంతగా 
గతులు తప్పుతున్నా 
నా నైజం 
వికసించడం!
నీ కంటికి 
కాంతులివ్వడం !

Saturday, March 10, 2012

నీలి మబ్బు దుఖం వెనుక 
చంద్ర రేఖలా ఉంది భవిష్యత్తు 
కలిసి వస్తే శేష శయ్య ! 
లేకుంటే అంపశయ్య !
ఇది బావుంది 
ఆహ్వానించావని వేళకు వస్తే 
వర్షం కదిలిందని పొమ్మంటావా?
హే! భగవాన్!
నిన్ను కీర్తించే సమయం ఎక్కడిది 
కాళ్ళకింద మంటలు 
కళ్ళకు దిగులు గంటలు తగిలించావు
మనమెక్కడ కలిసామో గుర్తు లేదు 
నాకయితే ఇంకా నా చేయి 
నీ చేతిలోనే ఉన్నట్లుంది!
మండుతున్న ఆకాశంలో 
కోరికలు చివురించేది ఎప్పటికి?
చల్ల బడిన భూమిపై 
ఆవేశం అర్రులు చాచేది ఎప్పటికి?
ఆ వచ్చేదేదో నీలి మేఘాన్ని 
తరలించుకుని రాకుడదూ!
పచ్చదనం, వెచ్చదనం నాలో దాచుకుంది 
నేను కాదు 
నీ హృదయ స్పందన!
గది కిటికీ మూత పడదు 
దృశ్య పరంపర ఆగిపోదు
ఆశ్చర్యం కాదు 
అపురూపమయిన సౌందర్యం!
నన్ను నన్నుగా పలకరించే 
ప్రాణ వైఖరి !
కదిలే గులాబీలు 
నీ లేత చెక్కిళ్ళు 
నడిచే మధురాలు 
నీ మాటల సుమాలు 
నన్ను అడిగి వెళితే బావుండేది 
నా గుండెలో గులాబీని కూడా
తోడు పంపేదాన్ని కదా!
అనుభవం నుండి 
ఆలోచన పుడుతుంది 
ప్రతి ముఖంపై 
రంగుల ఆశలు నిలుస్తుంది 
ప్రకృతి ఎప్పటినుండో 
నాలో ఒక భాగమయిపోయింది.
ప్రతి దృశ్యం 
నా నీడగా మిగిలింది 
అనుమానంతో ప్రతీదీ 
అగ్ని పరీక్షకు స్థానమవుతుంది 
అనురాగంతో జీవితం
అనల గుణాల్ని సహిస్తుంది..
చెట్టుకు పక్షికి ఉన్న బంధం 
మానవతకు భుజగ వలయమై 
అలరిస్తుంది 
జాతి ఒక్కటే అని 
నినదిస్తుంది..

Thursday, March 1, 2012

ఓం నమశ్శివాయ 
మంత్రం..సృష్టిలో 
జీవునికి జీవునికి మధ్య 
ఆశల సామీప్యం కోసం కాదు  
జీవునికి దేవునికి మధ్య 
వాస్తవం కోసం!