Tuesday, February 28, 2012

చేతికందని ఆకాశానికి 
ఆశ అనే నిచ్చెన వేసి 
కళ్ళల్లో నింపుకోవాలనే
ఆశ నాకు లేదు 
అందుకే 
ప్రకృతి ఆసాంతం 
నా గుండెలోనే
పదిలపరుచుకున్నాను !
కామానికి 
ప్రేమనే తొడుగు వేస్తే 
కలిగే బిడ్డలు వీరు 
ఆకలి వీరి చిరునామా 
అమానుషం వీరి వీలునామా!
చేతిలో అవి కాస్సేపు 
పట్టుకుని ఫోజులిస్తే 
రూపాయి దానం చేస్తామంటే 
పట్టుకున్నాడేమో  పాపం!
పూల గుత్తిలో 
పూల రంగులు వేరైనా 
రూపం ఒక్కటే 
మనుషుల మధ్యలో 
మనసులు వేరైతే మాత్రం
ఎవరికీ వారే!

తడబడినా 
ఆత్మీయతనే వెదికేది
నిదానమయినా  
గమ్యాన్నే చూపేది 
ఆ పాదాలు రెండు 
పసితనం ! వృద్దాప్యం !
వీటిని అనుసరిస్తే 
చాలు జీవితాంతం!

Sunday, February 26, 2012

కొందరు గతానికి 
దగ్గర బంధువులు 
మరి కొందరు వర్తమానానికి 
దూరం కాకుండానే శిలా నిద్ర 
వహించే అసంఖ్యాకాలు 
సామాన్యుని ప్రపంచం ఇపుడో హేతు మయం
కాలాన్ని నియమించలేని దేవుడు 
కాలానికి తలవంచక తప్పదు 
భూమి నిదురనుండి మేల్కొంది 
చెట్లు తలలూపుతున్నాయి..
కొండలు నిలదొక్కుకున్నాయి
నిజానికి వెలుగు కొత్త కాదు 
చీకటి అంతకన్నా కాదు! 
కాలం గడవదూ? ప్రశ్న దేనికి అన్నట్లు 
జీవితం ఉంది..
సృష్టి దానికి తోడు ఉంది..
నాపై ఒదిగిన పరిమళ వీచికలా 
ఉహల్లో పరుచుకొని గగన హృదయం వలె 
వసంతమయినా 
గ్రీష్మమయినా 
ఆరని ప్రాణ దీపం వలె 
నన్ను అనుసరించేది ఒక్కటే
ఒకే ఒక అమృత రూపం 
రాత్రి ఎదపై జ్యోత్స్నాకృతి 
మనో భువికలో మరో సృష్టి  

మబ్బు విరిసే వేళలో 
మొలక నవ్వులతో నీవు 
పూల రెక్కల ఉహలతో 
వర్శాఝారీ గమనంతో నేను 
తప్పని మరణ సూచికల వంటి 
]నా చూపులు ప్రసరించినా 
నీవు మాత్రం నా మార్గం 
సుగమమే చేసావు 
 
నేను నీకు దూరమవుతున్ననా
లేక నువ్వు నన్ను వదిలి వెళుతున్నావా ?
భూత కాలపు స్వరుపనివి 
మంచు తెర వంటి స్వప్నానివి 
అయితే 
నా వెనుక గండ శిలవి 
ముందు మంచు కొండవు !
రాత్రి లోతుల్లో 
చీకటి కెరటంలా పారుతూనే ఉంది 
పోరాటానికి  అంకితమైన 
స్మృతి చిహ్నాలు 
గుప్పెటలో దాచిఉన్న చిత్రాలు 
పొద్దు పొడిచిన ముఖాలతో 
శాంతి పూచిన కళ్ళతో 
శాంతి కుహరాలై వెలిసాయి 
కాంతి బింబాలై వెలిగాయి 

ఆకాశం ముఖం చాటేసింది 
అంత అందం నాది మరి!
అవని దుప్పట్లో దాక్కుంది 
అంతటి అనురాగం నాది 
అక్కడక్కడ అలికిడి వినిపిస్తోందే 
ఆ శబ్దం నా ఉనికిది 
అప్పుడప్పుడు పూలు రాలుతున్నాయే 
ఆ సౌందర్యం నా మాటది!
ఆదర్శాల ప్రదర్శనలో 
శిల్పాలు నృత్యం చేస్తున్నాయి 
ఆధునిక పర్వంలో 
ప్రజలు పక్కకు తప్పుకుంటున్నారు!
ఇప్పుడు చరిత్ర హృదయం కాదు 
ఆకర్షణ సూత్రం మాత్రమే!
సరస్సులో కావలసినంత 
నీరుంటేనే అలలు పైకి లేస్తాయి 
సంసారంలో ఉండాల్సినంత 
సహనం ఉంటేనే ఆత్మీయతలు వెల్లి విరుస్తాయి 
ఈ మౌన ప్రతిమలు 
ఎప్పటికప్పుడు 
ఈ చెట్టు మొదట్లోనో ఉంటాయి
పాపం!
వీరికి కావాల్సింది మాత్రం 
ఈ ఇంటి దాపుల్లోను కనిపించవు!
సూర్యుడెపుడు
కళ్ళల్లోనే ఉంటాడు 
కిరణం తొలగిపోతే 
ప్రాణం రెక్కలు తొడిగినట్లు ఉంటుంది 
అది హత్యా ?
ఆత్మ హత్యా?
పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే గాని తెలియదు 
కలా? వాస్తవమా ?
మనో వైజ్ఞానికుడిని 
సంప్రదిస్తే గాని అర్థం కాదు 
అందుకే 
మేల్కొనే సమయం 
మెల్లగా జారుకుంటోంది!

సమాజ సమయం 
వీడిపోయే ఆకృతితో కలిసి 
సరికొత్త గతులతో 
అస్తిత్వం చూపుతుంది 
జీవితానికి నిర్వచనం లేదు 
పైకేదిగే స్థాయితో పాటు 
అక్కడక్కడా మానవతా క్షామం 
కిందికి దిగుతూనే ఉంటుంది 
ముఖంలో నిశ్శబ్ద ముద్రల 
కోలాహల రేఖలు!
మనిషిని కాపాడే 
నిరంతర శాఖోపశాఖలు !
గుండెకు దర్వాజాలు 
కిటికీలు లేవు 
లోపలినుండి బయటకు 
బయటనుండి లోపలి 
మనిషి వెళ్లేందుకు 
దారిలేదు 
మనిషికి మనిషికీ మధ్య 
ఎన్ని గదులున్నా 
ఎప్పుడూ ఒక గది 
తెరిచే ఉంటుంది 
అదే సమాధి 
తెలుపు నలుపుని 
నలుపు ఎరుపుని 
కమ్మేయాలనే ప్రయత్నిస్తాయి 
రంగు హుంగులతో 
అందం చందం తమవే 
అనుకుంటాయి.
సృష్టి కదలికలో ఉన్నంత అనుభవం 
ముందు ఏపాటివి ఇవి?
జీవితం ఎంతటిదైనా 
మనో వ్యాపారమే!
గుండె అద్దాలు 
పగలకొడితే 
గెలిచినట్లనే నీ నమ్మకం 
ఎట్లా ఉందంటే 
సరస్సుపై నీటి పొరలు 
ఒక్కొక్కటిగా వోలిచేసి 
అందులోని చంద్రబింబాన్ని 
బయటకు లాగాలన్నట్లుగా ఉంది !
గడచిన కాలం శైధిల్యంతో
భవిష్యత్తుపై భయంతో 
కదిలిపోయే ముఖాల్లో కాంతి లేదు 
కనిపించే వాస్తవంలో శాంతి లేదు 
కాలం కరుగుతుంది వత్తి వలె 
ఆ వెలుగు తాలుకు నీడవా ?
నా చీకటి జాడవా?
దారికడ్డంగా 
నిలిచి ఉన్న నిన్ను చూసే 
సమయం లేదు..
నీ మనో కుహరంలోని బొమ్మల్ని 
చూసే మనసు లేదు 
నా ముందుకు రాకు 
నాకు కనిపించకు!

Tuesday, February 21, 2012

గాజుముక్క పగిలితేనేమి 
నేను మధ్యలో ఉంటే 
అంత అందమే!
గాలి ఎంత బిగుసుకుంటేనేమి
పరిసరాల్ని పంచుకుంటే 
అంతా అపురూపమే! 
దేశం దేహం 
రెండు కళ్ళు 
దేశం దేహాన్ని కాపాడుతుంది 
దేహం తనకు తానే 
కాపలా అంటుంది 
అయితేనేమి 
మీరు జండా ఎగరేయ్యండి 
మాకు మీరేదైనా 
తినగా మిగిలింది పెట్టండి 
జైహింద్!

Saturday, February 11, 2012

పచ్చదనం కంటికి వెచ్చదనం 
ప్రపంచం ధాటికి తట్టుకోలేక 
బిక్కు బిక్కు మంటూ 
పచ్చికంతా 
మేడ గోడల నానుకొని 
నీడల్లా చుట్టు ముట్టు కొని 
ఉన్న చోటనే కలలు పోగేసుకుంటున్నాయి 
శాంతి చెరిగిన పావురాలను తలపోస్తూ..
ఇక్కడ అడుగు పెట్టిన 
ప్రతి మనిషీ ఒక చిత్రం 
ఏదినా వస్తువు దొరికిందా 
ఎవరికీ?
ఎపుడో చెప్పు 
అదే దొరికితే 
ఈ నిరంతర అసహనం దేనికి?
మదిలో వెండి తెర
దానిపై పోరాడే నీడ 
ఆర్ద్ర ప్రకృతి వివృత రూపాలు 
కళలు..
కెమెరా కళ్ళ ముందుకొస్తే 
మిగిలేది కలలు

Saturday, February 4, 2012

ఒంటరి తనం 
ప్రకృతి మనిషికిచ్చిన వరం!
హిమాలయాలు ఒంటరివే!
పసిఫిక్ ఒంటరిదే!
ఆకాశం ఒంటరిదే !
భూమి ఒంటరిదే!
ఒంటరితనం 
అందం కలబోసుకున్న సుగంధం!
కొండలన్నీ ఏమయ్యాయి?
పచ్చికంతా ఏమయింది?
పసిపాప నవ్వులన్నీ ఏమయ్యాయి?
తెలియదు కానీ 
కొండలన్నీ 
ఆ తిరుమలేశుని సన్నిధిలో 
సేదతీరుతున్నాయి 
పచ్చికంత పట్టుపరుపై ఉంది 
అక్కడికి వెళ్ళే వ్రుద్దాప్యమయినా
పసితనమే మరి! 

Friday, February 3, 2012

నా ముఖంలో మౌనం 
అఖండ ధైర్యాన్ని ఆవహించి ఉంది 
సత్యం వెలుగు దుస్తులు వేసుకుంది 
ప్రకృతిలో ఆణువణువూ స్పందనం
నాలో కనిపించేది ఆకాశం 
అలంకార బహు భూమికల్లో 
అగ్నివలె జ్వలిస్తున్నా 
నేను నీ గుండె నై ప్రతిఫలిస్తున్నా !
నాకు జ్ఞాపకముంది ఆరోజు 
ఇసుకపై అడుగుజాడల్ని వెదుక్కుంటూ 
బొమ్మ జముడే మహా వ్రుక్షమయినట్లు 
క్రీనీడల కులాయంలో నివసించే కపోతంలా 
వివిధ వర్ణచిత్రాలన్నీ వాస్తవమవుతోంది 
అందుకే మనం ఉన్నచోటే సత్యమై నిలుస్తోంది 

మబ్బులు విరిసే వేళలో 
మెరుపు మొలక నువ్వే 
ఎండల మంటలలో '
చల్ల గాలివై నువ్వే!
ఒదిగిన పరిమళ వీచికలా 
గగన హృదయాన్ని పరచుకొని 
ప్రాణ దీపంలా నువ్వే !
నీవు దూర మవుతావా?
ఏది నా ముఖంలోకి చూడు 
నీలో నా పోలికలు లేవూ?
పక్షికి భయమే 
అందుకే ఎగరకుండా దాక్కుంది 
చేపకు భయమే 
ఈదకుండా ముడుచుకుంది 
అయితే 
స్వేచ్చా కవచంతో 
దీక్షా కవచంతో, 
అందమయిన లక్ష్యంతో 
ఈ క్రియా భూమిపై 
ఎగిరినా, నడిచినా మనిషే!
నిజానికి ఇక్కడ వెలుగు లేదు 
చీకటీ రాదు!
స్థితి భావనలో కొత్తదనం లేదు 
ఆకాశం సచిత్రంగా ఉంది 
ముఖం సాలోచనగా ఉంది 
అయితే ఎక్కడుంది నీ ప్రాణం ?
సూర్య బింబ వదనానికి 
నలుపురంగు పులిమి 
దిష్టి బొమ్మంటూ దగ్ధం చేసే ప్రయత్నం!
సప్త వర్ణాల ఇంద్ర ధనస్సుకు 
మరింత దగ్గర కావాలని 
నా స్వగృహం దాని కిందికి 
చేర్చినట్లు నా ఉహా చిత్రం!
మనిషికీ మనిషికీ మధ్య 
భయం నిండిన లోయ ఉంది 
మనసుకు మనసుకు మధ్య 
ధైర్యాన్ని కూడా కట్టుకున్న 
ఒక అందమయిన  లయ ఉంది 
కాకుంటే ఒకటి సుదీర్ఘం
రెండోది ఆచరణ యోగ్యం!
కొన్ని క్షణాలు అనుకోకుండా 
పువ్వులై గుండెపై మొగ్గలై పూస్తాయి. 
కొన్ని క్షణాలు కత్తులై గుండెనే 
తూట్లు పొడుస్తాయి..
అవన్నీ వేరుచేసి ఎరుకుంటే దొరికేవి 
రెండు ముత్యాలే. 
పక్షులైనా.. మనుషులైనా!..!
నిర్జన వన మర్గాన 
రాలిన ఆకుల మధ్య రహస్యం 
అహింస భీభత్సంతో 
కనిపించీ కనిపించని అదృశ్య చిహ్నం 
ఇది వ్యక్తి హింస కాదు 
మానసిక మనోజ్ఞ రూప 
యంత్ర స్వరూపం జీవితం..!